కాటన్
చీరలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, మట్టి గాజులు.. తల్లి పాత్రధారి
వేషధారణ అంటే ఇలానే ఉంటుంది. అయితే ఇప్పుడిది ‘అవుడ్డేటెడ్’ అయిపోయింది.
ఎంచక్కా చుడీదార్స్, డిజైనర్ శారీస్.. అంటూ అందమైన అమ్మల హవా సాగుతోంది. 30
ఏళ్ల వయసున్న హీరో పక్కన అక్కలా కనిపించే ఈ ‘యంగ్ మమ్మీస్’ ఖాతాలో నదియా
చేరారు. ఇటీవల విడుదలైన ‘మిర్చి’లో ప్రభాస్‌కి తల్లిగా ఆమె నటించిన విషయం
తెలిసిందే. ఈ సందర్భంగా నదియాతో ఫోన్‌లో జరిపిన సంభాషణ.
పాతికేళ్ల క్రితం ‘బజారు రౌడీ’లో హీరోయిన్‌గా కనిపించిన మీరు, ఇప్పుడు
‘మిర్చి’లో అమ్మగా కనిపించారు. ఇప్పటికీ గ్లామర్‌గానే ఉన్నారు. ఆ రహస్యం
ఏంటో? ధ్యాంక్స్ అండీ. పెద్ద పెద్ద కారణాలేవీ లేవు.
బేసిక్‌గా నాది పాజిటివ్ మైండ్. అదే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నేను
రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తాను. ప్రతిరోజూ వాకింగ్ చేస్తాను.
‘మిర్చి’లో తల్లి పాత్ర అంగీకరించడానికి కారణం?
మామూలుగా సినిమా అంటేనే పురుషాధిక్యం ఉంటుంది. కానీ నేను చేసే పాత్రలు
అందుకు అతీతంగా ఉండాలని కోరుకుంటాను. మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలు
చేయాలనుకుంటాను. ‘మిర్చి’లో అందుకు ఆస్కారం లభించింది కాబట్టి
ఒప్పుకున్నాను.
‘రీల్’ కోసం 30, 35 ఏళ్లు ఉన్న హీరోలకు తల్లిగా నటిస్తున్నారు.‘రియల్ లైఫ్’లో మీ పిల్లల వయసెంత?
నాకిద్దరబ్బాయిలు. ఒకడికి పదహారేళ్లు... మరొకడికి పన్నెండేళ్లు.
సినిమాల్లో మీ రీ ఎంట్రీ గురించి మీ పిల్లలేమంటున్నారు?
నా భర్త, పిల్లల సహకారం లేనిదే నేను సినిమాల్లో చేయలేను. మొత్తం మా
ఇంటిల్లిపాదికీ కథ, నేను చేయబోయే పాత్ర గురించి చెబుతాను. ఒకవేళ మా
పిల్లలకు నచ్చకపోతే... ‘ఈ కేరక్టర్ నీకు సూట్ కాదు’ అని చెబుతారు. వాళ్లలా
చెప్పిన తర్వాత ఆ సినిమా వదులుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను.
హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరమయ్యారు. అందుకిప్పుడేమైనా పశ్చాత్తాపపడుతున్నారా?
పశ్చాత్తాపం ఏమాత్రం లేదు. ఎందుకంటే పెళ్లి, పిల్లలు చాలా ముఖ్యమనేది నా
ఫీలింగ్. నేను సినిమా ఫీల్డ్‌కి వచ్చినప్పుడే ఓ నాలుగేళ్లు చేసి,
ఫుల్‌స్టాప్ పెట్టేయాలనుకున్నాను. అదే చేశాను.
పెళ్లి తర్వాత అమెరికాలో జీవితం ఆరంభించారు కదా.. అప్పుడేమనిపించింది?
పెళ్లికి ముందే మా ఆయన నాకు తెలుసు. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం.
పెళ్లికి ముందు ఒకరికొకరు తెలిసినా ఆయన వ్యాపారంతో, నేను సినిమాలతో బిజీగా
ఉండేవాళ్లం. అందుకే పెళ్లి తర్వాత రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నాం. ఆ
రెండేళ్లూ మాకు నచ్చిన పద్ధతిలో గడిపాం. ఆ తర్వాత పిల్లలతో మా ‘స్వీట్
హోమ్’ మరింత ఆనందంగా సాగుతోంది.
ప్రస్తుతం తెలుగులో ఏమైనా సినిమాలు ఒప్పుకున్నారా?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న
సినిమా ఒప్పుకున్నాను. ఆ చిత్రంలో సమంతకు తల్లిగా నటించబోతున్నాను.
ఇప్పుడు మీరు ఇండియాలోనే ఉంటున్నారా?ముంబయ్‌లో
సెటిలయ్యాం. షూటింగ్స్ ఉన్నప్పుడు మినహా నా కుటుంబ సభ్యులను మిస్ అయ్యే
పరిస్థితి లేదు. పది, ఇరవై రోజులు అవుట్‌డోర్ షూటింగ్స్‌కి వెళ్లేటప్పుడు..
ఓ పది రోజులు నిల్వ ఉండే వంటకాలు తయారు చేసి పెడుతుంటాను.
పిల్లలకు,
మా ఆయనకు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెబుతుంటాను. ఇలా షూటింగ్స్‌కి
రావడంవల్ల నా పిల్లలకు బాధ్యత పెరుగుతోంది. ‘మిర్చి’లో ప్రభాస్‌లాగా మా
పిల్లలు కూడా చాలా బాధ్యతగా ఉంటారు. నేను లేకుండా ఒంటరిగా కొన్ని పనులు
చేసుకోగలుగుతున్నారు. అది మంచిదే కదా.
No comments:
Post a Comment