దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చనడంలో సందేహం లేదన్న విషయం తెలిసిందే. గతేడాది జూలై నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఇక ఇప్పటికే క్లైమాక్స్‌తో పాటు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా వివరాలను, ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను, రిలీజ్ డేట్‌ను తెలియజేస్తూ రాజమౌళి అండ్ టీమ్ హైద్రాబాద్‌లో కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. సినిమా ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుందని, వచ్చే ఏడాది జనవరిలో ట్రైలర్, ఏప్రిల్ 28న సినిమా విడుదల చేస్తామని తెలియజేశారు. ఇక రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి సినిమా ప్రమోషన్స్ విషయంలో కొత్త పుంథలు తొక్కే ప్రయత్నం చేస్తున్నామని, ఇదివరకు ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చేయనటువంటి ప్రమోషన్స్ బాహుబలికి చేస్తామని తెలుపుతూ తమ ప్లాన్స్ స్పష్టం చేశారు.
రాజమౌళి చేపట్టిన ప్రమోషనల్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి..
బాహుబలి కామిక్స్ :
బాహుబలికి సంబంధించిన కామిక్ పుస్తకాలను అమేజాన్ సహకారంతో అక్టోబర్ 22 నుంచి అందుబాటులోకి తేనున్నారు. తమకు చిన్నప్పట్నుంచీ కామిక్ బుక్స్ అంటే ఇష్టమని, ఇప్పుడు తమ సినిమా కామిక్ బుక్స్ వస్తూ ఉండడం ఆనందంగా ఉందని ప్రభాస్, రానా ఇద్దరూ కామిక్స్ గురించి ప్రస్తావించారు.
వర్చువల్ రియాలిటీ ప్రమోషన్స్ :
బాహుబలి సినిమాతో మాహిష్మతి అనే సామ్రాజ్యాన్ని రాజమౌళి సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ సామ్రాజ్యాన్ని వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో ప్రదర్శించనున్నారు. ఇది అభిమానులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ 23న వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో మొదటి మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారు. ఇక ఈ తరహా ప్రమోషన్స్ కోసం టీమ్ 25 కోట్ల రూపాయలను కేటాయించింది.
ఫస్ట్‌లుక్ :
ఇక అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బాహుబలి 2 ఫస్ట్‌లుక్‌ను కూడా అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఈ రకంగా త్వరలో తాము చేయనున్న ప్రమోషనల్ కార్యక్రమాల గురించి రాజమౌళి టీమ్ ప్రెస్‌మీట్ ద్వారా తెలిపింది. బాహుబలిని మించేలా బాహుబలి 2 ఉంటుందని రాజమౌళి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.