ప్రభాస్ హీరోగా యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి'. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ఐదు భారీ సెట్స్‌లో ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ప్రస్తుతం మూడు వారాల చిత్రీకరణ కోసం ‘బాహుబలి' యూనిట్ గురువారం కేరళలోని మలబార్ ఫారెస్ట్‌కు చేరుకుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, అనుష్క, రానాతో పాటు మరికొంత మంది పాల్గొనగా కథకు కీలకమైన సన్నివేశాల్ని, ప్రభాస్‌పై కొన్ని పోరాట ఘట్టాల్ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించే యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయని యూనిట్‌వర్గాలు చెబుతున్నాయి. కేరళలో షూటింగ్ పూర్తి కాగానే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో కళా దర్శకుడు సాబు సిరిల్ రూపొందించిన ప్రత్యేక సెట్‌లలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తారని చిత్ర వర్గాల సమాచారం. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ మేకింగ్ వీడియోలో ప్రభాస్ గెటప్‌ను, రెండవ మేకింగ్ వీడియోలో అనుష్క గెటప్‌ను విడుదల చేసిన రాజమౌళి మూడవ మేకింగ్ వీడియోను డిసెంబర్ 14న రానా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్, రాణా అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అనుష్క హీరోయిన్. సినిమా కథ ప్రకారం ఇద్దరూ అనుష్కను ప్రేమిస్తారని, ఈ క్రమంలోనే ఇద్దరు ప్రత్యర్థులుగా మారుతారని సమాచారం. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా రానా సరసన ప్రణీతను తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వెలువడగా...అలాంటిదేమీ లేదని దర్శకుడు రాజమౌళి వివరణ ఇచ్చారు. వాస్తవానికి సినిమాలో మరో హీరోయిన్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ ఇద్దరు అనుష్కనే ప్రేమిస్తారు కాబట్టి అంటున్నారు సినీ వర్గాలు. మిగతా ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు కనిపించనున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్, సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్, మాటలు: అజయ్, విజయ్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, స్టైలింగ్: రమా రాజమౌళి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సమర్పణ: కె.రాఘవేంద్రరావు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాజమౌళి.