మరోధ్యాస కించిత్తు కూడా లేకుండా
వృత్తిలోనే అధిక సమయాన్ని వెచ్చించే వారిని పని రాక్షసులుగా అభివర్ణించడం
చూస్తుంటాం. ఆ కోవలో దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళిని ఉదహరిస్తున్నాయి
సినీవర్గాలు. ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక
గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన దర్శకత్వంలో నటించాలని హీరోలు
ఉవ్విళ్లూరడం తెలియందికాదు. అయితే ఆ అవకాశం అనుకోగానే అందరికీ లభించదు. ఎంత
ఇమేజ్ ఉన్న స్టార్ డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా తన కథకు సరిపోయే
హీరోనే ఎంపికచేసుకోవడం రాజమౌళిలోని మరో ప్రత్యేకత. కాగా ప్రభాస్
కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'బాహుబలి'పై ఇప్పుడు
అందరిచూపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవ్వరూ తియ్యనిరీతిలో
అత్యంత భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు.
రామోజీఫిలింసిటీలో నిర్మించిన భారీ సెట్లో ఈ చిత్రం రెండవ షెడ్యూల్
చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రభాస్ సరసన అనుష్క నాయికగా నటిస్తుండగా,
ప్రతినాయకుడి పాత్రను రానా పోషిస్తున్నారు. ఆర్కా మీడియా సంస్థ
నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడైన ఎం.ఎం. కీరవాణి
సంగీతాన్ని సమకూరుస్తుండగా, ఈ పీరియాడికల్ కథాంశ చిత్రానికి
జాతీయస్థాయిలో పేరున్న సాబు సిరిల్ కళను అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం
కోసం రాత్రి, పగలు తేడాలేకుండా నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నారట. ఉదయం 7
గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షూటింగ్ జరుగుతుండటమే కాదు ఆదివారంనాడు
ఉదయం 7 గంటలకు షూటింగ్‌ను మొదలుపెట్టి సోమవారం ఉదయం 8 గంటల వరకు అంటే 25
గంటలపాటు నిర్విరామంగా షూటింగ్ జరిపారట. సినిమా రంగంలో కెప్టెన్‌గా
భావించే దర్శకుడి కనుసన్నలలోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి అందుకే రాజమౌళిని
పని రాక్షసుడిగా అభివర్ణిస్తున్నాయి సినీవర్గాలు. అయితే రాజమౌళికి
పరిస్థితిని బట్టి ఎంత సమయమైనా లెక్కించకుండా షూటింగ్ చేయడం కొత్తేమీకాదని
పరిశ్రమలో అంటున్నారు. జానపద కోణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో 'బాహుబలి'
చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఆయన మరింత ఎక్కువగా
శ్రమిస్తున్నారని అంటున్నారు. ఈ తరహా చిత్రాలలో నటించే నటీనటులు మేకప్,
వస్త్రధారణ కోసం అధిక సమయం వెచ్చించాల్సి రావడంతోనే రాజమౌళి ఈ చిత్రం
షూటింగ్‌ను రేయింబవళ్లు లెక్కచేయక నిర్విరామంగా చేస్తున్నారని మరోపక్క
వినిపిస్తోంది.
No comments:
Post a Comment